తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయిని మించిన హాట్ టాపిక్ లేదు. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి విద్యాసంస్థలకు సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి,కాఫ్ సిరప్,టాబ్లెట్స్ లను విద్యాసంస్థలే లక్ష్యంగా యువతకు అమ్ముతున్న ముఠా ను 29వ తేదీన 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
విముక్తి కాలనీ సమీపంలో ఒక పాడుబడిన హాస్పిటల్ ప్రాంగణంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. మట్టి విజయ్ కుమార్ 29 ఏళ్ళు, రాజశేఖర్ 25 ఏళ్ళు, సాయి తేజ 23 ఏళ్ళు, దొండ ప్రసాద్ 20 ఏళ్ళు, సుంకర అయ్యప్ప 28ఏళ్ళ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వీరి వద్ద నుంచి 2లక్షల 40వేల విలువ గల24కేజీల గంజాయి,కోడిస్టార్ కాఫ్ సిరప్‌లు, 4 టాసెక్స్ సిరప్ లు, 3 నైట్రేవిట్ టాబ్లెట్స్ 8 షీట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
వీరివద్ద నుంచి 45,120రూపాయల నగదును సీజ్ చేశారు. చింతూరు నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కాఫ్ సిరప్ లు ,మత్తు టాబ్లెట్స్ సేకరించి నగరంలో యువకులకు వీటిని సరఫరా చేస్తున్నట్టు విచారణలో తెలిపారు. టూటౌన్ సిఐ ఈశ్వరుడు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నిందితులలో ఇద్దరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయన్నారు.ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న టూటౌన్ పోలీసులను అడిషనల్ ఎస్పీ కుమార్ అభినందించారు.