వయోధిక పాత్రికేయులు దండు కృష్ణవర్మ (72) శనివారం సాయంత్రం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 1950 మే 20న జన్మించిన కృష్ణవర్మ కెరీర్ ప్రారంభంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఆ తర్వాత పాత్రికేయ రంగ విశిష్ఠతను గమనించి, పెద్దల సలహాతో జర్నలిస్ట్ గా మారారు. ఇండియా టుడే తెలుగు మేగజైన్ ప్రారంభ దినాలలో కొన్నేళ్ళ పాటు మద్రాసులో అందులో ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక తదితర దిన పత్రికలలో జర్నలిస్ట్ గా వర్క్ చేశారు. ఆపైన వివిధ దిన, వార, మాస పత్రికలకు ఫ్రీలాన్సర్ గా సేవలు అందించారు. కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటున్న కృష్ణవర్మ నెల రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురి అయ్యారు. అనారోగ్యం నుండి కోలుకోకుండానే శనివారం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బండారు దత్తాత్రేయ సంతాపం
సీనియర్ పాత్రికేయులు దండు కృష్ణవర్మ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణవర్మ సతీమణి శ్రీమతి భవానితో ఫోన్ లో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. కృష్ణవర్మ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా విభాగంలో ఇంచార్జి గా అనేక సంవత్సరాల పాటు సేవలందించారని, తాను రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు తనకు అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారని, వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. జాతీయ వాద భావాలు మెండుగా ఉన్న కృష్ణవర్మ ఏ పనిచేసినా ఎంతో నిబద్ధత కనబరిచేవారని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తనవంతు బాధ్యతలను నెరవేర్చారని శ్రీ దత్తాత్రేయ గారు వారి సేవలను కొనియాడారు. కృష్ణవర్మ మరణం పట్ల శ్రీ బండారు దత్తాత్రేయ గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలాన్ని తట్టుకునే శక్తి, ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.