Site icon NTV Telugu

Janasena Party: శాంతిభద్రతల పేరుతో హక్కులను కాలరాస్తున్నారు

Janasena Party

Janasena Party

Janasena Party: ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్‌లో కార్యక్రమాలు చేయలేదా అని విమర్శించారు. బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జగనే స్వయంగా జెండాలు ఊపలేదా అని నిలదీశారు. అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం పర్యటన అనగానే అన్నీ మార్గాల్లో దుకాణాలు మూయించేస్తున్నారని.. ఆర్టీసీ బస్సులు పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారని ఆరోపించారు. ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా అని అడిగారు. శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Read Also: Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. 20ఏళ్ల వయసులో ఉంటే..?

ప్రతిపక్ష పార్టీ సమావేశాలకు సైతం పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర హోం శాఖకు ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పోలీసులకు ముందుగానే అనుమతులకు లేఖలు ఇచ్చినా తగినంత భద్రత ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఆర్టికల్ 19ని ఏపీలో నిషేధించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందా అని ప్రశ్నించారు. కచ్చితంగా ఏదొక రోజు జీవించే హక్కును కూడా హరిస్తారని చురకలు అంటించారు. ఈ ప్రభుత్వానికి భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక సందర్భాల్లో అనుమతి ఇస్తామని జీవోలో చెప్పడాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రత్యేక సందర్భాలు అనేవి కేవలం వైసీపీకి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అన్నారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తెచ్చారని.. బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్థరాత్రి వేళ హడావిడిగా ఉత్తర్వులిచ్చారని.. వైసీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టుకుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Read Also: Gudivada Amarnath: పవన్‌కు మంత్రి ఆఫర్‌.. ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తా..

జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని.. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా సభల్లో, జనవాణి కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖలో స్వచ్ఛందంగా జనం తరలివచ్చి పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలకడం, ఆ తరవాత పవన్ కళ్యాణ్‌ను నిర్బంధించడం అందరూ చూశారన్నారు. ఆ నిరంకుశత్వానికి కొనసాగింపే హోంశాఖ ద్వారా ఇప్పించిన చీకటి జీవో అన్నారు. ఇటీవల సత్తెనపల్లిలోని జనసేన కౌలురైతు భరోసా సభను అడ్డుకోవాలని చూడటం వాస్తవం కాదా అని నిలదీశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఆంక్షలు విధించి, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version