NTV Telugu Site icon

Pawan Kalyan: దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతా..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రం మొత్తం తిరిగే తాను పిఠాపురాన్ని వదిలేస్తా అనుకోవద్దన్నారు. పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యతను తీసుకున్న టీడీపీ కోఆర్డినేటర్ వర్మకి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో నిర్వహించిన ‘వారాహి విజయభేరి’ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఓడిపోయినా దశాబ్ధ కాలం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానన్నారు. దయచేసి తనను గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం తనకు కావాలన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు.

Read Also: Andhra Pradesh: వాలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

పిఠాపురంకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తానని పవన్‌ కల్యాణ్ హామీ ఇచ్చారు. పిఠాపురం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మీకు జవాబుదారీతనమని, తాను పారిపోయే వ్యక్తిని కానన్నారు. తనను ఓడించడానికి చిత్తూరు నుంచి మిధున్ రెడ్డి వచ్చాడన్నారు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టలేని తాను అంటే ఎందుకు కక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. మండలానికి ఒక నాయకుడు ఎందుకు వచ్చాడని.. కాకినాడ మాఫియా డాన్ నన్ను ఓడిస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. పిఠాపురంలో ఇల్లు తీసుకుంటానని, ఇక్కడే ఉంటానని పవన్ పేర్కొన్నారు. దేశంలో మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చి దిద్దుతానన్నారు. 54 గ్రామాలు ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎన్నికలకి కాదు.. గుండెల్లో పెట్టుకోవడానికి పిఠాపురం వచ్చానన్నారు. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు.

తాను ప్రభుత్వ ఉద్యోగి కొడుకునని.. జగన్‌లా సీఎం కొడుకును కాదన్నారు. మిధున్ రెడ్డి 60 నియోజకవర్గాలలో దోచేసిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు. సజ్జల, పెద్దిరెడ్డి, జగన్ అందరూ పేద వారే.. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని తాను పెత్తందారీనా అంటూ ప్రశ్నించారు. ఆలయాలు ధ్వంసం చేసిన ఎంత మందిని పట్టుకున్నారని వంగా గీతను అడగండి అంటూ ప్రజలను కోరారు. తాను గెలిచిన తర్వాత కాకినాడ మాఫియా డాన్‌ను పిఠాపురం రమ్మను.. తాటాకు చప్పుళ్ళకి భయపడను తోలు తీస్తానని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో ఎన్నికల ఖర్చుకి డబ్బులు కంటైనర్‌లలో పెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్ట్ డ్రగ్ మాఫియా, బియ్యం మాఫియా, ఆయిల్ మాఫియాకి కేంద్రంగా మారిందన్నారు.