ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు.
అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర సాగకుండా ఉండేందుకు రోడ్లు దిగ్బంధం, చెక్ పోస్టుల ఏర్పాటు కక్షసాధింపు చర్యలేనని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మూడు రాజధానులు అంటూ జగన్ విధ్వంసకర రాజకీయ చేస్తున్నారని విమర్శించారు. రైతుల పాదయాత్రపై కోర్టు ఆదేశాలనూ సైతం బేఖాతరు చేశారన్నారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.