ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన గురించే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా వైసీపీ, జనసేన మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. జనసేన చేపట్టిన రోడ్ల ఉద్యమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ విషయంలో ఒకరకంగా జనసేనాని వైసీపీ సర్కారుపై పైచేయి సాధించిందనే టాక్ సైతం విన్పించింది. ఇదే సమయంలో జనసేనాని వీలుచిక్కినప్పుడల్లా ఏపీ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగుతున్నారు. ప్రతీగా వైసీపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
కొంతకాలంగా జనసేనాని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సర్కారు ప్రధానంగా సంక్షే పథకాలపై ఫోకస్ పెట్టడంతో జనసేనాని దానినే టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తెరలేపే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేయబోతున్నారని సమాచారం. తద్వారా వైసీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం జనసేనాని చేయబోతున్నారు.
ఈమేరకు జనసేన మరోసారి రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గతంలోనూ జనసేన పార్టీలు పలుమార్లు ఏపీలోని సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. గతంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఇతరత్ర అంశాలపై మేథావులతో కలిసి పవన్ కల్యాణ్ సమావేశాలు నిర్వహించారు. ఆ మాదిరిగానే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా మరోసారి పవన్ కల్యాణ్ ఏపీలోని కీలక అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనసేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతుందని సమాచారం. ఈ సమావేశానికి మేధావులను పిలిచి ఏపీ ఆర్థిక లెక్కలను తేల్చనున్నారట. గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ట్వీటర్లో ఏపీ ఆర్థిక పరిస్థితిపై ట్వీట్ చేస్తుండటంతో ఇందులో భాగమేనని తెలుస్తోంది. ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని ఒకసారి. ‘దివాళాదిశగా ఏపీ ఆర్థిక పరిస్థితి’ అంటూ మాట్లాడుతున్నారు. ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో రాష్ట్రం కూడుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏపీకి ఈ పరిస్థితి కారణం ఎవరంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని అన్నిపార్టీల నేతలతోపాటు మేధావులను ఆహ్వానించనున్నారట. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఇతరత్రా వర్గాల నేతలు ఇందులో పాల్గొని చర్చించాలని జనసేనాని కోరుతున్నారు. టీడీపీ హయాంలో కేంద్ర సర్కారును ప్రశ్నించినట్లుగానే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆయావర్గాలు నిలదీసేలా జనసేన ప్లాన్ చేస్తోంది. అయితే జగన్ సర్కారును ప్రశ్నించడానికి మేధావివర్గం ఏమేరకు ముందుకొస్తుందనే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మరీ జనసేన చేపట్టబోయే రౌండ్ సమావేశాలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!