NTV Telugu Site icon

Minister Satyakumar Yadav: ఏపీలో పెట్టుబ‌డుల‌కు అపార‌మైన అవ‌కాశాలు

Satya Kumar Yadav

Satya Kumar Yadav

Minister Satyakumar Yadav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అపార‌మైన అవ‌కాశాలు, వ‌న‌రులు ఉన్నాయ‌ని అబుదాబికి చెందిన ఎంఎఫ్2 సంస్థ ప్రతినిధులకు వివ‌రించామ‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. మంగ‌ళ‌గిరి ఏపిఐఐసీ ట‌వ‌ర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాల‌యంలో ఆ సంస్థ ప్రతినిధుల‌తో గురువారం స‌మావేశమైన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశ‌మున్న రంగాల‌పై జినోమిక్స్‌, ప‌ర్యావ‌ర‌ణ మెడ్ టెక్‌, బ‌యోటెక్ విభాగాల్లో అపార‌మైన అనుభ‌వ‌మున్న ఎంఎఫ్‌2 సంస్థతో ప్రాథ‌మికంగా చ‌ర్చించామ‌న్నారు. వ్యాపార‌ప‌రంగా, సేవా ప‌రంగా ఏపీలో ఉన్న అవ‌కాశాల్ని సంస్థ ప్రతినిధుల‌కు వివ‌రించామ‌న్నారు. ఏపీలో బ‌ల్క్ డ్రగ్ పార్క్ మొద‌టి స్థానంలో ఉన్న విష‌యాన్ని, అలాగే సుమారు 170 ఎక‌రాల్లో విస్తరించి ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్‌, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 ఎక‌న‌మిక్ జోన్లలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవ‌కాశాల‌పైనా వారితో చ‌ర్చించామ‌న్నారు. అమ‌రావ‌తి ప్రాంతంలో హెల్త్ సిటీలో గానీ, ఎంపిక చేసిన 9 మునిసిపాలిటీల్లో హెల్త్ హ‌బ్ ల‌లో కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స‌త్యకుమార్ చెప్పారు.

Read Also: Amaravathi: అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్ర మంత్రి గ్రీన్‌సిగ్నల్!

ఆసుప‌త్రుల నిర్మాణాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉత్సాహాన్ని క‌న‌బ‌ర్చడ‌మే కాకుండా ప్రజ‌ల జీవ‌న ప్రమాణాల్ని మెరుగుప‌ర్చే స‌రికొత్త టెక్నాల‌జీ అయిన జీనోమ్‌ సీక్వెన్సీ గురించి ఈ సంద‌ర్భంగా ప్రస్తావ‌న‌కొచ్చింద‌న్నారు. ఎక‌న‌మిక్ కారిడార్లు, మెడ్ టెక్ జోన్ ల‌లో ఎంఎఫ్‌2 ప్రతినిధులు క్షేత్ర స్థాయి ప‌ర్యట‌న చేశాక సంబంధిత అధికారుల‌తో కూలంక‌షంగా చ‌ర్చించిన మీద‌ట తుది నివేదిక‌ను అంద‌జేస్తార‌న్నారు. ప‌లు ద‌ఫాలుగా సంస్థ ప్రతినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యాక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున పూర్తి స‌హాయ స‌హ‌కారాలాన్ని అంద‌జేస్తామ‌ని సంస్థ ప్రతినిధుల‌కు చెప్పామ‌న్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సింగిల్ విండో విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని, అవ‌స‌ర‌మైన రాయితీల్ని కూడా ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడ్డాక పెట్టుబ‌డిదారులు సానుకూల దృక్పథంతో ఉన్నార‌న్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై వారెంతో ఉత్సాహాన్ని క‌న‌బ‌ర్చార‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం క‌ల్పిస్తున్న అవ‌కాశాల్ని అందిపుచ్చుకుని పెట్టుబ‌డులు పెట్టేందుకు మందుకు రావాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు. ఎంఎఫ్‌2 సంస్థ ప్రతినిధుల‌తో జ‌రిగిన స‌మావేశంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ ఎం.టి.కృష్ణబాబు, ప‌రిశ్రమ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ య‌న్‌.యువ‌రాజ్, ఏపీఎంఎస్ఐడీసీ ఎం.డి లక్ష్మీ షా స‌మావేశంలో పాల్గొన్నారు.