ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రతీ ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రతీ ఏటా జూన్ 21న యోగా ప్రాధాన్యతను తెలియజెప్పేలా కేంద్ర ప్రభుత్వం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజల్లో దాని పట్ల అవగాహన పెంచుతున్నారు. ఈసారి మోదీ కర్ణాటకలోని మైసూరు ప్యాలెస్‌లో గ్రౌండ్లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవ వేడుకల్లో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు. వీరందరితో కలిసి మోదీ యోగాసనాలు వేయించారు.
విశాఖ స్వర్ణభారతీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎస్ ఠాకూర్ మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణలో యోగాసనాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. యోగా ఒక ప్రాక్టీస్ మాత్రమే కాదు జీవితం లో భాగం కావాలి. ప్రధాని మోడీ చేసిన కృషితో ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవంగా పరిగణిస్తున్నారు. యువతకు యోగా పట్ల పూర్తి అవగాహన రావాలన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగాను అందరూ అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్న మంత్రి కిషన్ రెడ్డి, పాఠశాలల్లో యోగా ను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమమని కిషన్ రెడ్డి అన్నారు.
ఏపీ హైకోర్టులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి. నేలపాడులోని హైకోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ప్రధాని నరేంద్ర మోడీ మైసూరు పాలెస్ నుండి ఇచ్చిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు సీజే. యోగాసనాలను చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో AP గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గవర్నర్ బీబీ హరిచందన్
విశాఖపట్నం స్వర్ణభారతీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. జిల్లాయంత్రాంగం, పోర్ట్ పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి ఎస్.ఠాకూర్ యోగా చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరివెంకటకుమారి, ఎమ్మెల్సీలు మాధవ్, కల్యాణి, పోర్ట్ ఛైర్మన్ రామ్మోహనరావు,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సిద్దిపేటలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ యోగాసనాలు వేశారు. యోగా ప్రాధాన్యతను మంత్రి హరీష్ రావు వివరించారు.యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. యోగ ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. యోగా చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చు. యోగా, వాకింగ్, సూర్య నమస్కారాలు వలన రోజు మరింత పనులు బాగా చేసుకోవచ్చు. భారత్ దేశాన్ని చూసి వివిధ దేశాల యోగ నేర్చుకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ లకు యోగా లాంటి శిక్షణ ఇస్తున్నాము. గర్బిణీలు ఇలాంటివి చేస్తే నార్మల్ డెలివరీలకి అవకాశం ఉంటుంది.
సిద్ధిపేటలో యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్‌ను పురస్కరించుకుని భారత జవాన్లు యోగా నిర్వహించారు. అది కూడా మామూలుగా కాదు. ఐటీబీపీ సైనికులు లద్దాఖ్‌లో 17 వేల అడుగుల ఎత్తులో, హిమాచల్ ప్రదేశ్‌లో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు.అసోం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఎదుట నిర్వహించిన యోగా కార్యక్రమంలో 33 బెటాలియన్ ఐటీబీపీ జవాన్లు. గడ్డ కట్టే మంచులో వేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
లడాఖ్ లో యోగా
అంతర్జాతీయ యోడా డేలో పాల్గొన్న పీవీ సింధు అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. యోగా ఒక్కరోజు చేసి ఆపేయడం కాదు.. రోజూ చేయాలి. యోగా చేయడం వల్ల మానసికస్థైర్యం పెరుగుతుంది. నేను రెగ్యులర్‌గా యోగా చేస్తా. రోజూ అరగంటైనా యోగా కోసం కేటాయించాలన్నారు. యోగా డేకి ఆహ్వానించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన యోగా వేడుకల్లో నటుడు అడివి శేష్,బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు,పాల్గొన్నారు. నాకు యోగా చేయడం అంతగా అలవాటు లేదు. నన్ను యోగా డేకి పిలవడం చాలా సంతోషంగా వుందన్నారు అడవి శేష్. జిమ్ కి వెళ్లి వర్కవుట్ చేయడమే కానీ యోగా చేయలేదు. ఇవాళ ఇక్కడికి రావడం వల్ల ఎంతో ఉల్లాసంగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు.యోగాని జీవితంలో భాగం చేసుకోవాలి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఏపీ ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న యోగా క్యాంప్ కి ముఖ్యఅతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ యోగా చేశారు. చాలా మంది ఇండియాకి విదేశీయులు యోగా నేర్చుకోవడం కోసం వస్తుంటారు, భారత దేశం గొప్పతనం యోగా. మన జీవన శైలిని విదేశీయులు కీర్తిస్తూ వుంటారు. యోగా అంటే ఒక ఫిలాసఫీ, పాజిటివ్ థింకింగ్ ని అలవరుస్తుంది. ఈ వత్తిడి జీవితంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ యోగా చెయ్యాలన్నారు మంత్రి విడదల రజినీ.
హైదరాబాద్ పరేడ్ గౌండ్స్ లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేష్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.