IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • జగదల్పూర్‌లో ల్యాండింగ్‌కు ఆటంకం
  • రాజమండ్రికి మళ్లించిన ఇండిగో విమానం
  • ఫ్యూయల్ నింపుకుని తిరుగు ప్రయాణం
  • సురక్షితంగా బయటపడ్డ 60 మంది ప్రయాణికులు
Indigo

Indigo

IndiGo Flight : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌కు ఈ ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, జగదల్పూర్ సమీపించే సరికి అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి (ల్యాండింగ్‌కు) అవసరమైన అనుమతులు లభించకపోవడం, వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పైలట్ విమానాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించారు.

తిరిగి శంషాబాద్‌కు పయనం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిన అనంతరం, విమానానికి అవసరమైన ఇంధనాన్ని (ఫ్యూయల్) అక్కడ నింపుకున్నారు. వాతావరణం సర్దుబాటు కాకపోవడంతో, ఆ విమానం ప్రయాణికులతో కలిసి తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి పయనమైంది. ఈ విమానంలో ప్రయాణించిన వారిలో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు కాసేపు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, విమానాశ్రయ అధికారులు , సిబ్బంది తగిన భద్రతా చర్యలు తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

×
×
Ad