Site icon NTV Telugu

Weather Update: ఈ వేసవిలో ఎండలు మండుతాయట

పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలకు గాను ఉష్ణోగ్రతలు, వర్షాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఈ బులెటిన్‌లో.. దక్షిణ భారతదేశంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొంత అధికంగా ఉంటుందంటోంది వాతావరణ శాఖ.

పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని అంటోంది. దక్షిణాదిలో మాత్రం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కాస్త ఊరట కలిగించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో మాత్రం ఎండలు దంచికొడతాయి. ఇక్కడ ఏప్రిల్ నుంచి ఎండ వేడిమి అంతకంతకూ పెరుగుతుందని వాతావరణశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, నీటిని ఎక్కువగా తాగుతూ డీ హైడ్రేషన్ కి గురికాకుండా వుండాలని వాతావరణ శాఖ సూచించింది.

https://ntvtelugu.com/ukraine-war-effect-on-indian-economy/
Exit mobile version