తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం.. ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీలోగా సోమేష్ కుమార్ ఏపీలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అయిపోయింది.. అయితే, సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లే అవకాశం లేదనే వార్తలు వచ్చాయి.. ఏపీకి వెళ్లడానికి సోమేష్ కుమార్ విముఖత చూపుతున్నారని.. పదవీ విరమణ చేయడానికి మరింత సమయం ఉన్నా.. ఇప్పుడే వీఆర్‌ఎస్ తీసుకుంటారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దగ్గర ఏదో ఒక పోస్టులో ఉంటారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, ఆయన అనూహ్యంగా.. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది..
Read ALso: America: భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిన విమానాలు
రేపు అనగా గురువారం రోజు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులతో ఏపీలో రిపోర్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఏపీ సచివాలయానికి వెళ్లే అవకాశం ఉందని.. ఆ తర్వాత మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అవుతారని ప్రచారం సాగుతోంది.. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన సోమేష్ కుమార్ రాజకీయా పార్టీల నుంచి అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అయితే, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో ఆయన పనితీరుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారట..
మొత్తంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుండి రిలీవ్ చేయబడిన సోమేష్ కుమార్.. డీఓపీటీ నిర్దేశించిన గడువుకు అనుగుణంగా గురువారం ఆంధ్రప్రదేశ్‌లో విధుల్లో చేరే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం.. ఆయన రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. జవహర్‌రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్టును సమర్పించనున్నారు.. మూడు సంవత్సరాలకు పైగా అత్యున్నత పదవిలో పనిచేసిన సోమేష్ కుమార్.. ఆంధ్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా సానుకూల సంకేతం పంపాలని మరియు చివరి వరకు.. అంటే పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం సోమేష్ కుమార్ సివిల్ సర్వెంట్‌గా ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సందేశం పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. దీంతో, ఆయన ఏపీ ప్రభుత్వంలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నాననే ఆరోపణలకు అవకాశం లేకుండా చేస్తారని చెబుతున్నారు.
