CM YS Jagan and New Governor Relationship: విశ్వభూషణ్ హరిచందన్.. మూడేళ్ల 7 నెలలపాటు ఏపీ గవర్నర్‌గా ఉన్నారు. రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్.. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే…అదే ఏడాది జూలైలో రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు విశ్వభూషణ్ హరిచందన్. అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ కు మధ్య సహృద్భావ వాతావరణం కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉన్నా.. సతీసమేతంగా వెళ్లి గవర్నర్ దంపతులతో సమావేశం అయ్యేవారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల దగ్గరి నుంచి.. పాలనాపరమైన అంశాలు వరకు ఎలాంటి జాప్యం లేకుండా సాఫీగా సాగిపోయేది. ఒకవైపు తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల్లో సీఎమ్, గవర్నర్ వ్యవస్థ మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు వ్యవస్థలు స్నేహపూరిత వాతావరణంలో వ్యవహరించాయి.
Read Also: Supreme Court: శివసేన వివాదం.. ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో
గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ మధ్య ఉన్న అనుబంధం.. వీడ్కోలు సమావేశాల సందర్భంలోనూ కనిపించింది. ముఖ్యమంత్రి చూపించిన ప్రేమను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ దంపతులు ఛత్తీస్ ఘడ్ కు వెళుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి స్వయంగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ హరిచందన్ కు పాదాభివందనం చేయటం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఇప్పుడు కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి సంబంధాలు ఉండనున్నాయి అన్న చర్చ జరుగుతోంది. హరిచందన్ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కావటం వల్ల.. సీఎమ్ జగన్ తో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. కొత్త గవర్నర్ వైఖరి ఎలా ఉంటుంది…హరిచందన్ తో ఏర్పడినంత అనుబంధం ఉంటుందా…అందులోనూ ఎన్నికల ఏడాది కావటంతో.. బీజేపీ హైకమాండ్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా అన్న చర్చ జరుగుతోంది.
అయితే, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఘనంగా స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నూతన గవర్నర్ కు ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌తో పాటు సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వాగతం పలికారు.. ఇక, కొత్త గవర్నర్‌కు విమానాశ్రయంలో నేతలను, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్.. అనంతరం పోలీసు గౌరవవందనం స్వీకరించిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఆ తర్వాత సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.. కాగా, ఎల్లుండి అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే. స్వాగత కార్యక్రమంలో.. కొత్త గవర్నర్‌తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు సీఎం.. మరి 24వ తేదీ తర్వాత రాజ్‌భవన్‌తో సీఎం సంబంధాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.