NTV Telugu Site icon

Yanamala: ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది..?

Yanamala

Yanamala

Yanamala: వైఎస్ జగన్‌ రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌పై వైసీపీ నేతలకు అవగాహన లేదు.. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారు.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారు.. జగన్‌ ముఠా లక్షల కోట్లు స్వంత ఆదాయం పెంచుకున్నారు.. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను కబ్జా చేశారు అంటూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: National Girlfriends Day 2024: జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?

అలాగే, ఇసుక, ఖనిజ సంపద లూటీ చేసి రూ.19 వేల కోట్లు స్వాహా చేశారు అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి భారాలు లేకుండా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విషం చిమ్మేందుకు కుట్రలు చేస్తున్నారు.. ఇప్పటికి తేలిన లెక్కల ప్రకారం రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు.. ఇంకా తేలాల్సిన అప్పులు వున్నవి.. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి కూడా అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సొంత ఇంటి కలను తీర్చేందుకు రూ.4 లక్షలతో గృహ నిర్మాణానికి సాయం చేస్తోంది.. ఇచ్చిన మాట ప్రకారం 16, 347 డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచాం.. పింఛన్‌ను రూ.4 వేలకు పెంచడంతో పాటు అన్న క్యాంటీన్లను, రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు.