Hero Suman Met Minister: ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను హీరో సుమన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదని.. రేపు ఓ కార్యక్రమం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నామన్నారు. ఏపీలో అవకాశం కల్పించడం, స్టూడియోలు కట్టడం మాత్రమే కాదు.. ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఆడాలంటే లోకేషన్లు బాగా ఉండాలన్నారు. పెద్ద సినిమాలు 20శాతం మాత్రమే ఏపీలో తీసి మిగిలినవి విదేశీ లోకేషన్లలో తీస్తున్నారని హీరో సుమన్ చెప్పారు.
Read Also: Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
తమిళ, మలయాళ సినిమాలు రాసే కథల్లో స్వేచ్చ ఉంటుంది…వారు ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు ఇండస్ట్రీ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని, 20 శాతం బయట తీయాలని అప్పట్లో రూల్ పెట్టారన్నారు. ఇక్కడి లోకేషన్లన్ని ఇప్పటికే తీసేసాం.. ప్రేక్షకులు కొత్త లోకేషన్లు ఉంటే తప్ప సినిమాలను ఆదరించడం లేదని ఆయన చెప్పారు. పెద్ద సినిమాలకు సెట్స్ వేయడానికి డబ్బు ఉంది.. చిన్న సినిమాలకు అది సాధ్యం కాదన్నారు. తెలుగు సినిమాలు సక్సెస్ అయితే అవి కూడా డబ్బింగ్ అవుతాయన్నారు.
గతంలో చెన్నైలోనే అన్ని సినిమాలు తీసేవాళ్లమని పేర్కొన్నారు. లోకేషన్ల విషయంలో కండిషన్లు వద్దు, చిన్న సినిమాలకు మరింత ఫ్రీడం ఇవ్వాలని ఆయన కోరారు. ఫిలిం సిటీలా ఏపీలో చిన్న చిన్న సెట్ కట్టాలని రన్నింగ్ అవ్వడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబంధంగా పెడితే ఆదాయాలకు కొదవ ఉండదన్నారు. ఏపీలో ఉన్న ప్రోడ్యూసర్లు అందరూ ఇక్కడే తీద్దామనుకుంటున్నారని.. హైదరాబాద్‌లో కాస్ట్ ఎక్కవనే అభిప్రాయం వారికి ఉందన్నారు. ఒక మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రులు చర్చించి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడాలని హీరో సుమన్ కోరారు. ఓటీటీ జమానాలో సినిమాలు తీయాలంటే కథ బావుండాలి లోకేషన్లలో కొత్తదనం ఉండాలన్నారు. గతంలో ఇక్కడే కాదు కశ్మీరులో సైతం సాంగ్స్ షూటింగ్ చేశామన్నారు.