Nadendla Manohar: రేపు తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకుని వైఎస్ జగన్ తెనాలి రావాలి అని సూచించారు. ఎంతో ఘనత ఉన్న తెనాలిని గత ఐదేళ్లు గంజాయికి అడ్డాగా చేశారు అని ఆరోపించారు. రెండు గ్యాంగులు తెనాలిని అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరిపాయి.. గంజాయి బ్యాచ్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల పైనే కాకుండా పోలీసుల పైనా కూడా గంజాయి మత్తులో దాడి చేశారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Read Also: HHVM : ‘వీరమల్లు’ టికెట్ల రేట్ల పెంపు.. ఫిల్మ్ ఛాంబర్ కు ఏఎం రత్నం..
ఇక, ఐతానగర్ నగర్ ఏరియాలో ఉన్న ఇళ్లలో గంజాయి పెంచిన దారుణమైన పరిస్థితి తెనాలిలో తీసుకొచ్చారు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా చేశారు.. గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెనాలి ప్రశాంతంగా ఉంది.. రాజకీయ లబ్ది కోసం వచ్చి అలజడులు సృష్టించకండి అని కోరారు. జగన్ తెనాలి వచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.. ఇలాంటివి ప్రోత్సహించవద్దు.. లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకుని రావొద్దు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.