కిడ్నీ డొనేషన్ పేరుతో భారీ ఆన్లైన్ మోసం గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా ఓ కిడ్నీ రాకెట్ సైబర్ నేరగాళ్ళు చీటింగ్ చేసినట్లు తెలుస్తుంది… ఆన్లైన్లో లింకును టచ్ చేసిన ఓ విద్యార్థినికి కిడ్నీ డొనేట్ చేస్తే ఏడు కోట్ల రూపాయలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు వలవిసిరారు. అప్పటికే తనకున్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో కిడ్నీ డొనేట్ చేయడానికి సిద్ధపడింది విద్యార్థిని. అయితే కిడ్నీ అమ్మాలన్న, డబ్బు కావాలన్నా ,ప్రాసెసింగ్ ఫీజులు కింద డబ్బు చెల్లించాలని విద్యార్ధినిని నమ్మబలికారు సైబర్ నేరగాళ్లు ….దీంతో తండ్రి అకౌంట్లో నుంచి విడతల వారీగా 16 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు అప్పగించింది విద్యార్థిని. తీరా తాను మోసపోయానని తెలుసుకొని ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత విద్యార్థిని.
గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన యామిని అనే ఇంటర్ విద్యార్థిని గుంటూరులోని ఓ కళాశాలలో చదువుతుంది.. అయితే తనకున్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో తండ్రి అకౌంట్లో నుంచి 80వేలు తీసుకొని సొంత అవసరాలకు వాడుకుంది ….అయితే తన తండ్రికి తెలిస్తే దండిస్తారు అన్న భయంతో ఎలాగైనా ఆ డబ్బును ఎకౌంట్లో వెయ్యాలన్న ఆలోచనతో ఉన్న విద్యార్థినికి ఆన్లైన్లో ఉన్న ఓ లింకు ఆశాజనకంగా కనిపించింది…. కిడ్నీ డొనేట్ చేస్తే ఏడు కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆ లింకులో మెసేజ్ వచ్చింది.. దీంతో తాను తండ్రి దగ్గర వాడుకున్న డబ్బుతో పాటు తమ కుటుంబానికి ఏ చీకు చింత లేకుండా జీవితాంతం గడిపే అవకాశం ఉంటుందని, తన కిడ్నీ అమ్మడానికి సిద్ధపడింది.
Read Also: Rahul Gandhi : రాహుల్ భారత్ జోడో యాత్ర @ 100 రోజులు.. హిట్టా.. ఫట్టా
అయితే ఆన్లైన్లో పరిచయమైన సైబర్ కేటుగాళ్ళతో మాట్లాడిన విద్యార్థిని వాళ్ళు చెప్పిన అనేక రకాల రక్త పరీక్షలు చేయించుకుంది. వాటి రిపోర్టులు ఆన్లైన్ లో సబ్మిట్ చేసింది …దీంతో సైబర్ కేటుగాళ్లు ఓ ఆన్లైన్ ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి అందులో మూడున్నర కోట్ల రూపాయలు జమ చేసినట్లు చూపించి విద్యార్థినిని నమ్మించారు. ఆ మూడున్నర కోట్ల రూపాయలు రిలీజ్ అవ్వాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు కట్టాలని కండిషన్ పెట్టారు….దీంతో విద్యారిని పదహారు లక్షల రూపాయలు తన తండ్రి అకౌంట్లో నుంచి జమ చేసింది. తండ్రి ఫోన్ తనదగ్గర ఉండడంతో విడతల వారీగా సైబర్ నేరగాళ్లకు జమ చేసింది విద్యార్థిని.
ప్రాసెసింగ్ ఫీజు కింద డబ్బు కట్టాలని 16 లక్షల రూపాయలు వసూలు చేసిన కేటుగాళ్లు మూడున్నర కోట్ల రూపాయలు రిలీజ్ చేయక పోవడంతో విద్యార్థిని ఆందోళన చెందింది….దీంతో ఢిల్లీ రావాలని విద్యార్థినికి చెప్పారు సైబర్ నేరగాళ్లు….ఎలాగైనా తండ్రి అకౌంట్లో నుండి తీసిన అమౌంట్ తిరిగి అకౌంట్ లోకి జమ చేయాలని భావించిన విద్యార్థిని గత అక్టోబర్లో కిడ్నీ రాకెట్ ముఠాను కలవడానికి ఢిల్లీ వెళ్ళింది …విద్యార్థిని విజయవాడ నుంచి ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళింది… ఐతే ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన విద్యార్థినికి అక్కడ సైబర్ నేరగాళ్ళ నుండి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ఢిల్లీలోని ఓ మారుమూల ప్రాంతానికి రావాలని చెప్పడంతో భయపడింది విద్యార్థిని…. దీంతో సైబర్ నేరగాళ్ళను కలవకుండానే తిరిగి గుంటూరు జిల్లాకు చేరింది.
ఈ లోపుగా విద్యార్థిని తండ్రి జరిగిన విషయాన్ని గమనించాడు… తన అకౌంట్లో డబ్బు మాయం అయిపోవడం చూసి ఆ ఎకౌంటు ఉన్న ఫోన్ కూతురు వాడుతుందని తెలుసుకుని కూతురిని నిలదీశాడు. దీంతో జరిగిన విషయం తండ్రికి చెప్పి కన్నీటి పర్యంతమైన విద్యార్థిని యామిని ….తాను యూట్యూబ్లో లింకు క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల మాయమాటలకు నమ్మి 16 లక్షలు చెల్లించానని తెలిపింది. ఇల్లు కట్టుకుందామని లోన్ ల ద్వారా తీసుకువచ్చిన డబ్బు అకౌంట్ లో ఉంచితే తెలిసి తెలియని తనంతో కన్నబిడ్డ సైబర్ నేరగాళ్లకు సొమ్మంతా అప్పగించేసింది అన్న బాధతో పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు చెల్లించిన అకౌంట్ల వివరాలు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది….. అయితే విద్యార్థిని నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.ఆన్లైన్ లింకులతో మోసపోయిన విద్యార్థిని ఇచ్చిన వివరాలు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సైబర్ నేరగాళ్ళను అరెస్టు చేస్తామని అంటున్నారు. సైబర్ మోసాల గురించి ఎంతగా అవగాహన కలిగించినా ఇంకా యువత మోసపోతూనే ఉందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ.
(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెండ్ల సౌజన్యంతో..)
Read Also: Upasana: ఉపాసన బిడ్డను కనబోయేది సరోగసి ద్వారానా?