NTV Telugu Site icon

Gudivada Amarnath: చంద్రబాబు, లోకేష్‌లను మించిన ఐరన్ లెగ్ లేరు

Gudivada Amarnath

Gudivada Amarnath

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్‌ను సందర్శించిన తరుణంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనపై హాట్ కామెంట్స్ చేశారు. మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబు వైజాగ్‌కి వచ్చారని, ఈ సందర్భంగా ‘అమరావతి అభివృద్ధిని చేస్తాం, విశాఖను రాజధాని చేస్తాం’ అని అమరావతి ప్రజలకు చంద్రబాబు చెప్పొచ్చు కదా అని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రం కరువుతో ఉందని.. ఆయన రాజకీయాలు చేస్తూ, నారా లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లను మించిన ఐరన్ లెగ్ ఎవరు లేరని విమర్శించారు.

చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే దమ్ము లేకపోవడం వల్లే ప్రతిపక్షాలు కలవాలని అంటుంటారని మంత్రి ఎద్దేవా చేశారు. సొంత కొడుకు కంటే దత్త పుత్రుడినే చంద్రబాబు ఎక్కువగా నమ్ముకున్నారని, అందుకే పవన్ వెంటే పడుతున్నారన్నారు. పప్పు బెల్లాలులాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, కానీ ఆ పథకాల్లో అవినీతి ఎక్కడైనా జరిగిందా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ధరలు పెరగలేదా? అంటూ నిలదీశారు. ప్రజా ఉద్యమం రావడం వల్లే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారని, ‘సెటప్ చంద్రబాబు గెటౌట్ చంద్రబాబు’ అనే స్లోగన్ తీసుకోండని అమర్నాథ్ పిలుపునిచ్చారు. 2024లో వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్‌లను త్వరగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటి గురించి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను కోరామని మంత్రి తెలిపారు. కడప జిల్లాలోని కొప్పర్తి, కాకినాడలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. రాష్ట్రంలోని పోర్టులు, హార్బర్‌ల మధ్య విమాన, రహదారి, రైలు కనెక్టివిటీ గురించి చర్చించామన్నారు. విశాఖ-కాకినాడ మధ్య పెట్రో కెమికల్‌ కారిడార్‌లో రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జిఎఐఎల్‌, హెచ్‌పిసిఎల్‌ ముందుకొచ్చాయని. రాష్ట్రంలో 34 నూతన ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రతిపాదనలు సమర్పించామన్నారు.