Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్‌ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదికే పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాపై విషం చిమ్ముతూ జీవో.2430ను తెచ్చి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మొట్టికాయలు తిన్నాడని… అయినా సిగ్గూశరం లేకుండా మళ్లీ ఇప్పుడు జీవో నెం.1తో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తున్నాడని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.
Read Also: SomiReddy: జగన్‌కు ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు కానీ ఆంక్షలు విధిస్తారా?
జగన్ పాలనలో అంతా డొల్లతనమే ఉందని.. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి చంద్రబాబును ఆదరిస్తున్నారన్న అక్కసుతోనే జగన్ చీకటి జీవో తీసుకొచ్చాడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక ప్రభుత్వ కుట్రకోణం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. ప్రతిపక్ష నేత కార్యక్రమాల్లో వైసీపీ వాళ్లే ఉద్దేశపూర్వకంగా అలజడి, తోపులాట సృష్టించారని తాము అనుకుంటున్నామని బుచ్చయ్యచౌదరి అన్నారు. తాజా జీవోతో జగన్ ప్రజాస్వామ్య హంతకుడిగా మారాడని గోరంట్ల స్పష్టం చేశారు. కమ్ముకొస్తున్న ప్రజాగ్రహాన్ని కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలు, ఇలాంటి చీకటి జీవోలతో ఆపడం జగన్ తరంకాదన్నారు. మరి రాజమండ్రిలో జగన్ ఎలా సభ పెట్టాడని.. ప్రభుత్వం తెచ్చిన జీవో జగన్‌కు వర్తించదా అని ప్రశ్నించారు. జగన్ సభకు వచ్చిన పార్వతమ్మ అనే మహిళ బస్సు కిందపడి కాళ్లు విరగ్గొట్టుకుందని.. కనీసం ఆమెను ఎవరూ పరామర్శించలేదని గోరంట్ల మండిపడ్డారు.
