భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది గత రెండు రోజులుగా ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 4.4 అడుగుల వద్ద ఉంది. దీంతో 3 లక్షల 69 వేల 259 క్యూసెక్‌ల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. స్పిల్ వే ఎగువన 30.050 మీటర్లు, దిగువన 20.25 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పిల్ వేలోని 48 గేట్ల ద్వారా 3 లక్షల 98 వేల 995 క్యూసెక్‌ల నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికమవుతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి వరద మరింత పెరుగుతుందనే అంచనాతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బ్యారేజీ వద్ద నీటి నిల్వను భారీగా తగ్గించాలని డిసైడ్ అయ్యారు. బ్యారేజీ మొత్తం (175) గేట్లను పాక్షికంగా ఎత్తివేశారు. ధవళేశ్వరం వద్ద 70 గేట్లు, ర్యాలీ 43 గేట్లను 0.6 మీటర్ల మేర ఎత్తారు. మద్దూరు వద్ద 23 గేట్లు, విజ్జేశ్వరం వద్ద 39 గేట్లను 0.4 మీటర్లు లేపారు. దీంతో గడచిన రెండు రోజుల్లో గోదావరి నీటిమట్టం 10 అడుగుల నుంచి ఇప్పుడు 4.4 అడుగులకు పడిపోయింది.