NTV Telugu Site icon

Godavari Floods: నిలకడగా గోదావరి.. కానీ,

Godavari

Godavari

గోదావరి ఉధృతి కొనసాగుతోంది.. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది.. గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద నిలకడగా ఉంది. గోదావరి వరద తగ్గుముఖం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునగగా దేవస్థానం కల్యాణ కట్ట కిందిభాగం ఇంకా నీటిలోనే ఉంది. దీంతో అటుగా ఎవరిరీ రానీయకుండా పటిష్ఠ గస్తీ ఏర్పాటు చేశారు. మరోవైపు గోదావరి వరద కారణంగా మరోసారి విలీన మండలం వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. రుద్రంకోటలోని సుమారు 4 వందల కుటుంబాల వారు బతుకుజీవుడా అంటూ సమీపంలోని గుట్టపైన గుడారాల్లో పిల్లాపాపలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర సరకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

Read Also: Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?

కుక్కునూరు మండలంలో వెంకటాపురం, ఎల్లప్పగూడెం, కోమట్లగూడెం పరిసర ప్రాంతాల్లో సమీపంలోకి వరద వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని బూర్గంపాడు వద్ద ఇప్పటికే రహదారి మునిగిపోయింది. ఈ మార్గంలో పయనించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కుక్కునూరు పోలీసులు సూచిస్తున్నారు. ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది. దాదాపు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి కాస్త తగ్గముఖం పట్టినా.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఆలయాలన్ని వరదనీటిలోనే ఉన్నాయి. ఆలయ ప్రాంగణాలలో వరదనీరు చేరడంతో ఆలయాలను మూసివేశారు. నదీ ప్రవాహాం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి చెంతకు ఎవ్వరు వెళ్లకుండా పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు.గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.