కరోనా వైరస్ ఎందరో ప్రాణాలు తీసింది.. ఇంకా తీస్తూనే ఉంది.. ఇదే సమయంలో.. కోవిడ్ బారినపడి మరణించినవారి మృతదేహాలు తారుమారైన ఘటనలు చాలానే ఉన్నాయి.. కానీ, విజయవాడలో ఓ వింత ఘటన వెలుగు చూసింది.. కరోనాబారినపడిన గిరిజమ్మ అనే మహిళలను బెజవాడ జీజీహెచ్లో చేర్చాడు భర్త.. ఆ తర్వాత ఆమె చనిపోయినట్టు ఆస్పత్రి నుంచి సమాచారం ఇచ్చారు.. ఓ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ తంతు జరిగి 15 రోజులు గడిచిన తర్వాత గిరిజమ్మ ఇంటికి వచ్చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేటకు చెందిన ముక్త్యాల గిరిజమ్మకు కరోనా సోకింది.. దీంతో.. మే 12వ తేదీన బెజవాడ జీజీహెచ్లో చేర్చారు.. అయితే, మే 15న గిరిజమ్మ చనిపోయిందని జీజీహెచ్ నుంచి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు.. దీంతో.. ఆమె భర్త గడ్డయ్య.. మార్చురీలోకి వెళ్లి తన భార్య గిరిజమ్మ మృతదేహం అనుకుని వేరే మహిళ మృతదేహం తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.. ఇక, గిరిజమ్మ లేదని అనుకుంటున్న తరుణంలో.. అంత్యక్రియలు నిర్వహించిన 18 రోజుల తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది.. తనకు కరోనా పూర్తిగా నయమైందని చెప్పింది గిరిజమ్మ.. మొత్తంగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు మొదట షాక్ తిన్నా.. మరో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించామని నిర్ధారణకు వచ్చారు.