కాకినాడ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు (మం) పోతులూరు, కొడవలి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. పులిని బంధించే వరకు రైతులు పొలాల వైపు వెళ్లొద్దని ఎంపీ సూచించారు. 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రకటించారు. పులిబారినపడి చనిపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఎంపీ గీత.
మరోవైపు ప్రత్తిపాడు వద్ద పులి సంచారంపై అధికారులు అప్రమత్తం అయ్యారు. పులి వేట కొనసాగుతోంది. 120 మంది ఫారెస్ట్ సిబ్బందితో పులిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. నిన్న మరోసారి సీసీ కెమెరాలలో పులిసంచారానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోతులూరు సమీపంలో 80 అడుగుల గుట్టపై పులి తిరుగుతోంది. పులిని బంధించేందుకు మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ లో వైజాగ్ నుంచి వచ్చిన జూ అధికారులు పాల్గొంటున్నారు. పులి జాడ కనిపెట్టేందుకు 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
ఇదిలా వుంటే.. వారం రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరీసరాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. పోతులూరు వద్ద పాడి పశువును చంపిన ప్రదేశంలో నీటి కుంట వద్దకు పులి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కొద్ది రోజులుగా ఒమ్మంగి…శరభవరం గ్రామాల్లో పది పశువులపై పులి దాడి చేసింది. సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి సంచారంపై భయాందోళన చెందుతున్న ప్రత్తిపాడు మండల ప్రజలకు అధికారులు అభయం ఇస్తున్నా. కర్రలతో గుంపులుగా పొలాలకు వెళ్తున్నారు రైతులు. పులి వచ్చిన దారిలోనే తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా సమీప గ్రామాల ప్రజలు పులి పేరు చెబితేనే వణికిపోతున్నారు.
Tiger Hulchul: ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం