చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు.
కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏ సమాచారం గాని బయటకు రానివ్వకుండా దాచిపెడుతున్నా కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ యాజమాన్యం. కుప్పం ద్రావిడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి గురైన విద్యార్ధినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆహారంలో నాణ్యత లోపం వల్ల అలా జరిగిందా? సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది విచారించాల్సి వుంది. దీనిపై స్పందించేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు.
మరోవైపు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. 25 మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని చంద్రబాబుకు వివరించారు టీడీపీ స్థానిక నేతలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూనివర్సిటీ విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానిక నేతలకు చంద్రబాబు సూచించారు.
మంత్రి సురేష్ ఆదేశాలు
చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ యూనివర్సిటీ లో విద్యార్థినుల అస్వస్థత పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరాతీశారు. అస్వస్థతకు కారణాలు ఏమిటో గుర్తించాలని, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి.సంఘటనపై నివేదిక అందజేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు మంత్రి సురేష్. విద్యార్థినుల అస్వస్థత సంఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఆదేశాలు జారీచేశారు మంత్రి సురేష్.