Fake Cement Racket: నకిలీ పాలు, నకిలీ నెయ్యి, ఇలాంటివి కల్తీ చేయడం చూసి ఉంటాం.. కానీ, సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ ను తయారు చేస్తున్న వ్యవహారాన్ని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు విజిలెన్స్ అధికారులు. 2018లో కస్తూరి సిమెంట్స్ పేరుతో కంపెనీకి లైసెన్స్ తీసుకున్నట్లు తేలింది. మహేష్ రావు, మహేశ్వరి బాయ్ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లేపాక్షి సిమెంట్స్ పేరుతో బ్రాండింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. కానీ అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, రాశి సిమెంట్స్ పేరుతో అమ్మకాలు కొనసాగించినట్లు గుర్తించారు. ఈ నకిలీ సిమెంట్స్ అమ్మేందుకు తెలివిగా కర్ణాటక రాష్ట్రాన్ని దుండగులు ఎంచుకున్నారు.
అయితే, కంపెనీ యాజమాన్యానికి అనుమానం రావడంతో అనంతపురం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో 10% సిమెంట్, 80 నుంచి 90% బూడిదతో కలిపి సిమెంట్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి, గుత్తివారిపల్లి గ్రామాల మధ్య ఈ నకిలీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఒక్క సంవత్సరంలోనే 43 కోట్ల రూపాయల సిమెంట్ అమ్మకాలు జరిపినట్లు తేలింది. GST వయోలేషన్స్, నకిలీ బ్రాండింగ్, పొల్యూషన్ లాంటి కేసులు నమోదు చేశారు.