MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..

Chirri Balaraju

Chirri Balaraju

MLA Chirri Balaraju: ఏలూరు జిల్లాలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరోసారి వివాదంలో నిలిచారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి దాడికి యత్నించాడని కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తుండగా, మరోవైపు తనపై ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని వంశీ వాదిస్తున్నారు. సమాచారం ప్రకారం, పూనెం వంశీ గతంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వద్ద పనిచేసిన వ్యక్తి. ఇటీవల ఎమ్మెల్యేకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో వంశీపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదుకు సంబంధించి వివరణ కోరేందుకు వంశీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వంశీపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు అండగా నిలిచి సేవలు చేసిన తనను, తన తల్లిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదంటూ వంశీ ఎమ్మెల్యేను ప్రశ్నించినట్లు వీడియోల్లో వినిపిస్తోంది. మరోవైపు, ఎమ్మెల్యేపై దాడికి వంశీ ప్రయత్నించాడని కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

×
×
Ad