NTV Telugu Site icon

AP Crime: పోలీసుల పేరుతో బురిడీ కొట్టించే ప్రయత్నం.. షాకిచ్చిన వ్యాపారి..!

Cyber Crime

Cyber Crime

AP Crime: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఘరానా మోసానికి తెరలేపాడు ఓ కేటుగాడు. పోలీసునని చెప్పి డబ్బులు అవసరమని తనకు ఫోన్ పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా క్యాష్ పంపిస్తానని వ్యాపారులను నమ్మబలికి బురిడీ కొట్టించాలనుకున్నాడు. అయితే వ్యాపారస్తులు చాకచక్యంగా ప్రవర్తించడంతో కేటుగాడి వలకు చిక్కలేదు. ద్వారకాతిరుమలలో ఓ కేటుగాడు వ్యాపారులతోపాటు , ఓ ఉద్యోగిని మోసగించి డబ్బులు కాజేయడానికి ప్రయత్నించాడు. నెలరోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి తాను పోలీసునని చెప్పి, తనకు డబ్బులు అవసరమని రూ.45 వేలు ఫోన్ పే చేయమని, కానిస్టేబుల్ ద్వారా నగదు పంపిస్తానని చెప్పాడు. దాంతో వ్యాపారి ఆ వ్యక్తి మాటలు నమ్మి రూ.45 వేలు ఫోన్ పే చేశాడు. అయితే, ఆ తర్వాత ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో మోసపోయానని గ్రహించినా చేసేదిలేక సైలెంట్ గా ఉండిపోయాడు..

Read Also: Ram Charan: రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకోవాలనే కోరిక తీరింది: మెల్‌బోర్న్‌ మేయర్‌

అయితే తాజాగా ఆ కేటుగాడు ద్వారకాతిరుమలలో ఫంక్షన్ హాల్ యజమానికి, సొసైటీ సెక్రటరీ కాల్ చేశాడు. తను ద్వారకాతిరుమల ఏఎస్ఐ పనిచేస్తున్నానని, సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ కు యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్ నిమిత్తం డబ్బులు అవసరమని, రూ. 50 ఫోన్ పే చేస్తే మరో కానిస్టేబుల్ తో తనకు నగదు పంపిస్తానని నమ్మబలికాడు. గత అనుభవాలతో అప్రమత్తమైన సొసైటీ సెక్రటరీ కిషోర్ ముందు నగదు పంపించండి ఫోన్ పే చేయిస్తానని చెప్పడంతో కేటుగాడు కంగుతున్నాడు. అయితే, ఇలాంటి వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు.. మరోవైపు.. సైబర్‌ నేరగాళ్లు ఏ విధంగానైనా ముగ్గులోకి దింపి.. డబ్బులు కాజేసే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు..