చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా వుంటుంటారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడిచేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. చేతికి అందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏనుగుల గుంపు దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు వైపు నుంచి కుప్పం సమీపంలోని తంగాల్ సమీపంలోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి.
ఇటు విజయనగరంలోనూ గజరాజులు రైతుల్ని హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గజరాజులు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ రైతాంగాన్ని, ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో వివిధ గ్రామాల్లో గజరాజులు తిష్ట వేస్తున్నాయి.
గజరాజులకు అనుకూలంగా తోటలు, నీరు ఉండడంతో మైదాన ప్రాంతాన్ని వీడకుండా సంచారం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటల్ని గజరాజులు నాశనం చేయడంతో రైతులు దిక్కులేక అల్లాడుతున్నారు. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ రైతులు పండించే అరటి, బొప్పాయి, చెరకు, వరి పంటలను నాశనం చేస్తున్నాయి.