Minister Nara Lokesh: తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు మంత్రి నారా లోకేష్.. రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ‘హలో లోకేష్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఆసక్తికరంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల పట్ల గౌరవం, సమానత్వం ఎంతో అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలను అవమానపర్చేలా, కించపరిచేలా వ్యవహరించే చర్యలపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియాలో మహిళలను తక్కువగా చూపించే అంశాలను నిషేధించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
Read Also: Modi-Priyanka Gandhi: మోడీ-ప్రియాంకాగాంధీ భేటీ.. దేనికోసమంటే..!
“ఆడింగోడివా, చేతికి గాజులు వేసుకున్నావా, చీర కట్టుకో” వంటి మాటలు ఇళ్ల దగ్గరైనా మాట్లాడటం మానేయాలని విద్యార్థులకు సూచించారు లోకేష్. మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలని అన్నారు. ఈ విషయాన్ని మీ ఇంట్లో, మీ స్నేహితుల దగ్గర ‘లోకేష్ అన్నయ్య చెప్పాడని చెప్పండి’ అంటూ సందేశం ఇచ్చారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. అందుకోసం తాము ప్రయత్నిస్తున్నామని, రాజకీయాల్లో మంచి మార్పు రావాలంటే విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొన్నానని, వాటిని ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగానని చెప్పారు.
తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన లోకేష్.. ప్రస్తుతం డాక్టర్ సలహా మేరకు డైట్ పాటిస్తున్నానని, ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నానని తెలిపారు. క్రమశిక్షణతో జీవిస్తే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు చెప్పారు. “అమ్మకు చెప్పలేని పని మనం చేయకూడదు” అన్నది జీవితంలో తనకు మార్గదర్శక సూత్రమని తెలిపారు. అమ్మను గౌరవించాలి, అమ్మను చూసుకోవాలి అని విద్యార్థులకు భావోద్వేగంగా సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించిందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.