Ganesh Nimajjanam 2024: గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేశారు.. దీంతో వరుసగా రెండో రోజూ కూడా గణేష్ నిమజ్జనాలు గోదావరిలో చేయడాన్ని నిలుపు వేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తున్న వాటిని పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.. అయితే, గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోన్న తరుణంలో.. ఈనెల 13వ తేదీ నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి ఉన్నట్లు ప్రకటించారు అధికారులు… ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జనాలు నిర్వహించే ఇసుక ర్యాంపు వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also: Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేసినట్టు వెల్లడించారు.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయాయి గణేష్ నిమజ్జనాలు.. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఎవరు గోదావరిలో స్నానం చేయడానికి గాని, బట్టలు ఉతకడానికి గానీ, గణేష్ నిమజ్జనాలు చేయడానికి గాని నదిలోకి వెళ్ళవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. నిలకడగా కొనసాగుతోంది గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.30 అడుగుల వద్ద నిలకడగా గోదావరి వరద ప్రవాహం ఉంది.. బ్యారేజ్ నుండి 15 లక్షల 33 వేల 339 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రం నుండి గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది.. ఈ రోజు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించనున్నారు.. భద్రాచలం వద్ద 44.60 అడుగుల గోదావరి నీటిమట్టం ఉండగా.. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ప్రకటిస్తారు.. ఎగువ ప్రాంతాల్లో తగ్గుతున్న కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.