Cyclone Threat In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు నెలకొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరి కొద్దీ గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ ఆవర్తనం పశ్చిమ దిశగా కదిలి రేపటికి మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేశారు. అనంతరం అక్టోబర్ 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొనింది.
Read Also: Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?
ఇక, అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై వాయుగుండం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి గాలుల వేగం అధికంగా ఉండటం వల్ల రాబోయే నాలుగు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వెటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.