Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది. అనపర్తి, రామచంద్రపురం, నిడదవోలు ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో రైతుల చేతికి అందాల్సిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.
Read Also: Abhishek Bachchan: అవార్డులు కొనుక్కుంటాడంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్
అయితే, మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఎకరానికి 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
Read Also: Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం
అలాగే, తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ మొత్తం జలమయం అయింది. దేవీపట్నంలోని పునరావాస కాలనీ పూర్తిగా మునిగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, గోకవరం- వీర్లంకపల్లి మధ్యలో పెద్ద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్రీరంగపట్నం గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.
Read Also: RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
ఇక, తుఫాను ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఇంకా మత్స్యకార కుటుంబాలు బురద నీళ్లలోనే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న 3 వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వేచి చూస్తున్నారు. ఓడలరేవు నుంచి కోట్లాది రూపాయల చమురు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ఓఎన్జీసీ తమ ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
