Custom Officers Caught Huge Gold In Andhra Pradesh: ఏపీలోకి భారీగా స్మగ్లింగ్ అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారం స్మగ్లింగ్ అవుతోందని సమాచారం అందడంతో.. కస్టమ్స్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రూ. 11 కోట్ల విలువ చేసే బంగారం స్మగ్లింగ్ వ్యవహారాన్ని చేధించారు. నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లురుపేట, చిలకలూరి పేట తదితర ప్రాంతాల్లో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించారు. వంద మంది అధికారులతో 20 బృందాలుగా ఏర్పడి.. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి సుళ్లూరుపేట వస్తున్న ఒక వ్యక్తి నుంచి 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా వేర్వేరు ఆపరేషన్స్‌లో మొత్తంగా వేర్వేరు వ్యక్తుల నుంచి 13.189 కేజీల బంగారాన్ని అదుపులోకి తీసుకున్నారు. లెక్కల్లో చూపని రూ. 4.24 కోట్ల నగదును కూడా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న బంగారంపై విదేశీ కంపెనీల గుర్తులూ ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వారిని ఆర్ధిక నేరాల కోర్టులో హాజరుపరిచినట్టు కస్టమ్స్ విభాగం వెల్లడించారు.
ఈమధ్య గోల్డ్ స్మగ్లర్ల ఆగడాలు పెట్రేగిపోతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ… బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు ఏపీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో, కార్లలో తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా తనిఖీల్లో భారీ బంగారం పట్టుబడింది. ఒక్క రోజులోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడడంతో కస్టమ్స్ అధికారులు షాక్‌కి గురయ్యారు.