CPI Narayana Again Fires On YS Jagan Over Meters Issue: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే.. వాటిని పెట్టడానికి వచ్చిన అధికారులతో పాటు సిబ్బంది వేళ్లు నరికేయండని రైతుల్ని సూచించారు. బుధవారం సాయంత్రం చిత్తూరులో నిర్వహించిన జిల్లా రైతు సదస్సులో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే.. ఆయన కొడుకు జగన్ మాత్రం మోటార్లకు మీటర్లు బిగించడం ఏమాత్రం సబబు కాదన్నారు. రాజన్న పాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. రాజన్న పాలన తెస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు రాజన్న మాటకు పంగనామం పెట్టారన్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టి.. రైతులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తే, వాటిని పగలగొట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని.. జగన్‌కి ఆ ధైర్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్.. కేంద్రానికి భయపడుతున్నారని అన్నారు. అప్పట్లో నిజాం నవాబు వస్తే.. రాజు వచ్చాడు, దూరంగా వెళ్లండని సైన్యం చెప్పేదని.. ఇప్పుడు అంతకుమించి వందలాది మంది పోలీసులతో జగన్ తిరుమలలో పర్యటించారని విమర్శించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల దాకా.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా జగన్ పర్యటన సాగిందన్నారు. వేల సంఖ్యలో పోలీసులు కాపలా కాశారని.. సీఎం జగన్‌కి ఎందుకంత అభద్రతా భావమని ప్రశ్నించారు.
అంతకుముందు కూడా వైఎస్ జగన్‌పై సీపీఐ నారాయణ ధ్వజమెత్తారు. సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని.. సీఎం అయ్యాక మాట మార్చారని అన్నారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర, ర్యాలీలంటే జగన్‌కి ఎందుకంత కోపమని ప్రశ్నించిన ఆయన.. పాదయాత్రలు చేసే మీరు (జగన్), వైఎస్సార్ ముఖ్యమంత్రులు అయ్యారని గుర్తు చేశారు.