జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… పవన్ వైజాగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. విశాఖలో పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని ఎలాంటి ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని పోలీసులు పవన్ కల్యాణ్‌కు నోటీసులు అందించారు. అంతేకాదు.. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా పవన్ కల్యాణ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే, ఇదంతా పవన్ కల్యాణ్‌కే మంచి చేస్తుందంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ యాత్రను అడ్డుకుని రగడ సృష్టించారని మండిపడ్డారు.. వైసీపీ పోతపాలు, కృత్రిమ ఉద్యమం విఫలం అయ్యిందంటూ విశాఖ గర్జనపై సెటైర్లు వేసిన ఆయన.. పవన్ ను టార్గెట్ చేసి జనసైనికులను రెచ్చ గొట్టారని ఆరోపించారు..
Read Also: Pawan Kalyan: 115 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు.. హైకోర్టుకు వెళ్తాం..
విశాఖ గర్జన జరిగింది.. పవన్ కల్యాణ్ మీటింగ్ ఆపేశారు.. అయినా పవన్‌కే మంచి జరిగిందన్నారు నారాయణ.. మరోవైపు.. రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న ముస్లిం సంఘాల నేతలను అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు.. రైతులకు మద్దతుగా వెళ్తున్నవారు కత్తులతో వెళ్లడం లేదు కదా? అని ప్రశ్నించారు.. ఇక, అమరావతి విషయంలో వైఎస్ జగన్ మాట తప్పి మోసం చేశాడని మండిపడ్డారు.. దున్నపోతు మీద వర్షం పడినట్టు వుంది జగన్ పాలన అని ఎద్దేవా చేశారు నారాయణ.. మరోవైపు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని 600 రోజులుగా ఉద్యమం జరుగుతుంది.. విశాఖ ఉక్కుపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. వైసీపీ ఎంపీలు విశాఖ ఉక్కుపై ప్రధాని వద్ద ప్రస్తావన తీసుకురావట్లేదు అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు దద్దమ్మల్లా మారిపోయారని ఫైర్ అయ్యారు.
ఉత్తరాంధ్రపై మాట్లాడుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులది కపట ప్రేమ అని ఆరోపించారు రామకృష్ణ.. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకుండా కేంద్రం నెట్టుకోస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో నియంతృత్వ ధోరణి నడుస్తుందన్నారు.. వైసీపీ ప్రజా ప్రభుత్వమా..? పోలీస్ ప్రభుత్వమా? అని నిలదీశారు.. పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారిపోయారని ఫైర్ అయ్యారు రామకృష్ణ.. కాగా, విశాఖ పర్యటన ముగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. సాయంత్రం జనసేన హెడ్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
