Site icon NTV Telugu

CPI Narayana: ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలి.. అసలు ఏపీకి మోడీ ఎందుకొచ్చారో తెలియదు..!

Cpi Narayana

Cpi Narayana

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ నల్లధనాన్ని ఆపలేకపోతున్నారని విమర్శించారు.. నల్లధనాన్ని అరికట్టడంలో విఫలమైన ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి నిబంధనలు వర్తింవని తెలిసి ప్రైవేటు పరం చేయమని ప్రధానమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, ప్రైవేటు విమానాల్లో అక్రమ నగదు తరలిస్తున్నారని.. దేశంలోని ప్రైవేట్ విమానాలపై నియంత్రణ పెట్టాలని డిమాండ్‌ చేశారు నారాయణ.. ప్రతి ఎన్నికల్లో ప్రైవేటు విమానాల ద్వారా డబ్బును రవాణా చేస్తున్నారని ఆరోపించారు.. కేవలం, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రూ.600 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారన్నారు.. మరోవైపు, గంజాయి యథేచ్చగా అక్రమ రవాణా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Posani Krishna Murali : కోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనపై స్పందించిన నారాయణ.. అసలు ఏపీకి ప్రధానమంత్రి మోడీ ఎందుకు వచ్చారో తెలియదు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. రూ.11 వేల కోట్ల హామీలకే ఆనందంలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్.. విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. పోలవరం, ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధానిని ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. ఇక, పవన్ కల్యాణ్ ను పక్కచూపులు చూడొద్దని తన వైపే చూడమని ప్రధాని చెప్పినట్లుంది అంటూ మోడీ-పవన్‌ భేటీపై సెటైర్లు వేశారు. ఏపీలో వైకాపా విజయానికి సహకరించేలా ప్రధానమంత్రి వ్యవహరించారని దుయ్యబట్టిన ఆయన.. వైకాపా, బీజేపీ బంధం ఫెవికాల్ లాంటిదేనని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా వేధింపులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాడ్‌ చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై వైకాపా రాజకీయ దాడులు సరికాదని హితవుపలికారు.. ఏపీలో అధికార పార్టీనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోందని.. అమరావతి రాజధాని అన్న వైకాపా నేడు మూడు రాజధానులు అనడం దిగజారుడు తనమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.

Exit mobile version