Andhra Pradesh: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయం ముందు రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను గురువారం నాడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించారు. సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో శుక్రవారం మరోసారి సీఎంవో అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ మేరకు ఆరుద్రతో మాట్లాడిన అంశాలను అధికారులు నివేదించారు.
సీఎం ఆదేశాల మేరకు రాజులపూడి ఆరుద్రను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తీసుకువచ్చారు. ఈ మేరకు ఆరుద్రతో ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి మాట్లాడారు. సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని ధనుంజయ్ రెడ్డి తెలిపారు. జీవనోపాధి కల్పించేందుకు ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. ఆరుద్ర సమక్షంలో నేరుగా కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆమెకున్న స్థిరాస్థిని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎవరైనా అలాంటి పరిస్థితులను సృష్టిచేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై ఇప్పటికే శాఖా పరంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని, ఎలాంటి నిరాశకు గురికావొద్దని, ధైర్యంగా ఉండాలని ఆరుద్రకు ముఖ్యమంత్రి కార్యదర్శి భరోసా కల్పించారు.
Read Also: దేశంలోని ఈ ఉన్నత పదవులు పొందాంటే ఎంత వయసు ఉండాలి?
కాగా తనకు సహాయం చేస్తున్న సీఎం జగన్‌కు బాధితురాలు ఆరుద్ర కృతజ్ఞతలు తెలియజేసింది. తనలాంటి అసహాయులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకం తనకు ఉన్నాయని తెలిపింది. అందుకే తాను తాడేపల్లి వచ్చానని పేర్కొంది. తన కుమార్తె వైద్యానికి పూర్తి ఖర్చులను భరిస్తాననడం సంతోషకరమని.. ఉపాధికోసం ఉద్యోగం కల్పిస్తామనడంపై ఆనందం వ్యక్తం చేసింది. రెండు రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు యోగక్షేమాలు కనుక్కుంటూ, పరామర్శిస్తూ బాగోగులు చూసుకున్నారని ఆరుద్ర వెల్లడించింది.
