సినిమా టికెట్ల ధరలపై నేడు సీఎం జగన్‌తో చిరంజీవి టీం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించామని ఆయన తెలిపారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం… ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడరని ఆయన వెల్లడించారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారని ఆయన తెలిపారు.
రేట్లకు సంబంధించినంత వరకు… అందరికీ ఒకటే రేట్లు అని, ఆన్లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశామని ఆయన పేర్కొన్నారు. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించామని ఆయన తెలిపారు. ఏడాదికి వెయ్యి రూపాయలతో అమెజాన్ ఇస్తుందని, నెలకు సగటున రూ.80లు పడుతుందని, దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించామని, ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుందని, దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లామన్నారు. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మాడిఫై చేశామన్నారు.