కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల్లో అసమ్మతి బయటపడింది. పలు చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలో మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు గొల్ల బాబూరావు, పార్థసారథి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ అసమ్మతి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం జగన్ వెంటనే మేల్కొన్నారు. పార్టీలో వివాదాలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, మంత్రులతో వరుస భేటీలను సీఎం జగన్ నిర్వహించారు. అనిల్ కుమార్ యాదవ్‌కు బుధవారం సీఎం జగన్ తన అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారమే బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో జగన్ సమావేశమై మంతనాలు జరిపారు. అటు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరారని సమాచారం. మిగిలిన అసమ్మతి నేతలను కూడా సీఎం జగన్ కలిసి ప్రత్యేకంగా మాట్లాడి వారిని కూల్ చేయనున్నారు. ఇప్పటికే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు గుంటూరు జిల్లా వైసీపీ పగ్గాలను అందించిన సంగతి తెలిసిందే.