NTV Telugu Site icon

CM Jagan: టార్గెట్ కుప్పం, టెక్కలి.. వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

Cm Jagan Mohan Reddy

Cm Jagan Mohan Reddy

CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లోనూ గెలవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వైసీపీ నేతలకు ఈ అంశంపై ఆయన దిశానిర్దేశం చేశారు. తాజాగా టీడీపీ ఖాతాలో ఉన్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ బుధవారం నాడు వైసీపీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పం సెగ్మెంట్ నుంచి ప్రారంభించారు. అనంతరం అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతోనూ సీఎం జగన్ మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కుప్పం, టెక్కలి అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు. ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో వ్యూహాలు అమలు చేయాలని సూచించారు.

మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి నుంచి అడుగులు కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతామన్నారు. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయన్నారు. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోందని.. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని తెలిపారు. ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్లను గడపగడపకూ చేర్చగలిగామన్నారు. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్‌ కార్డు వివరాలతో సహా అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగామని తెలిపారు. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్‌ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ద్వారా ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చామన్నారు. అర్హత ఉన్నవారికి మిస్‌ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశామన్నారు. గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175కి 175 నియోజకవర్గాలలో మనం ఎందుకు విజయం సాధించలేమని జగన్ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశామన్నారు. ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభమైందని.. ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలవుతుందని సీఎం జగన్ తెలిపారు. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా 175కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. జగన్‌ చేసే పని జగన్‌ చేస్తాడని.. ప్రతి గ్రామంలోనూ, నియోజకవర్గంలో కార్యకర్తలుగా, నాయకులుగా ఎవరు చేసే వాళ్లు చేయాలని సూచించారు. ప్రతి గడపకూ వెళ్లాలని.. మనం చేసిన మంచిని వారికి గుర్తుచేయాలని, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలని సూచించారు. కేవలం ఏ ఒక్కరి వల్లనే ఇది జరగదని.. అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుందని తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జడ్పీటీసీలు 3కు 3 గెలిచామని గుర్తుచేశారు. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాగే మంచి విజయాలు నమోదు చేశామని పేర్కొన్నారు. మనకు ఎన్ని గొడవలు ఉన్నా సరే పక్కన పెడదామని.. బిగ్గర్‌ పిక్చర్‌ గుర్తుకు తెచ్చుకుందామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే 30 ఏళ్లు మనం ఉంటామని.. ఇవాళ మనం చేసిన కార్యక్రమాలతో వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు కూడా రాబోతుందని.. సుమారు రూ.4362 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. డిసెంబరులో దీనికి శంకుస్థాపన చేయబోతున్నామని.. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు డిసెంబరులో పునరుద్ధరణ చేయబోతున్నామని సీఎం జగన్ చెప్పారు.

Read Also: UP Parking Fight: ప్రాణం తీసిన పార్కింగ్ వివాదం.. ఇటుకతో తల పగలగొట్టాడు

అటు వచ్చే ఎన్నికల్లో ఫస్ట్ టార్గెట్ కుప్పం, సెకండ్ టార్గెట్ టెక్కలి అని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు నామినేషన్ కూడా దాఖలు చేసే పరిస్థితి లేదన్నారు. నామినేషన్ దాఖలు చేస్తే అచ్చెన్నాయుడు గెలిచినట్లేనని జోస్యం చెప్పారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు కైవసం చేసుకుని తీరుతామన్నారు. కాగా ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అచ్చెన్నాయుడిని గత ఎన్నికల్లోనే ఓడించాలని జగన్ చేసిన ప్లాన్‌లు ఫలించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడిని ఓడించాలని జగన్ కంకణం కట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో పార్టీ బలోపేతంపై వైపీపీ దృష్టి సారించింది. కుప్పంలో తమ పార్టీ గెలిచేందుకు ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు.

Show comments