ఉత్తరాంధ్రలో జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని.. ఒక్క మరణం కూడా సంభవించొద్దని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని… సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదని తెలిపారు.
జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని… సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యమన్నారు. అలాగే మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలని… ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాలలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉండాలని… ఆ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించాలన్నారు. ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయని భావిస్తే, అక్కడి ప్రజలను ముందుగా గట్టిగా అప్రమత్తం చేయాలన్నారు సీఎం జగన్.