CM Jagan: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ జమ చేశారు. ఏటా జూన్, డిసెంబర్ నెలలో పెండింగ్ దరఖాస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. .. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.
Read Also: CM Jagan Live: వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ
అనర్హులకు పథకాలు రాకూడదు, ఇవ్వకూడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అనర్హులకు నోటీసులు ఇస్తారని, రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోరు అని పేర్కొన్నారు. లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నామని.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఏ పథకం రావాలన్నా ఆ కమిటీలకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. మధ్యవర్తులు లేకుండా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. ఎలాంటి తప్పు లేకపోతే ప్రెస్‌మీట్ పెట్టి ఆ మీడియా సంస్థలను తిట్టడానికి కూడా వెనుకాడొద్దని సీఎం జగన్ సూచించారు.