CM Chandrababu: సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక లాంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని.. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరు గార్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.
Read Also: Amalapuram: ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
ఇక, బడుగు, బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఉపయోగపడే, వారిని పేదరికం నుంచి బయటపడేసే పథకాలను రద్దు చేయడం వల్ల ఆ వర్గానికి తీరిని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సోషల్ వెల్ఫేర్ శాఖకు కేటాయించిన నిధుల్లో 83 శాతం ఖర్చు చేస్తే.. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 67 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారని అధికారులు వివరించారు. రోజూ వారీ కష్టంపై బతికే, అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారిని పేదరికం నుంచి బయట పడేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని సీఎం సూచించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తేవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.