టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. వరుసగా మూడోసారి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా వుందని మంత్రి పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. వాలంటీర్లను ప్రజలు కూడా మెచ్చుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాడు అని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి రోజా ప్రశంసించారు.
Also Read : CP Anand: త్వరలో పోలీస్ వ్యవస్థ పునర్వవస్థీకరణ.. రాజధానిలో 40 కొత్త స్టేషన్లు
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి రోజా అన్నారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమన్నారు. రాజధానిలో వుండటానికి పేదలు పనికిరారా.. వారు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తారా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబును, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని మంత్రి చెప్పారు. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించిన సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్ట్ సైతం సమర్ధించిందని మంత్రి రోజా గుర్తుచేశారు.
Also Read : Minister KTR: వాషింగ్టన్ డీసీలో WTITC స్కై సోరర్ లాంచ్ చేసిన మంత్రి కేటీఆర్
ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు తాము ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నామని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా వున్న సమయంలో ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. పేదలను చూస్తే చంద్రబాబుకు ఇంత అహంకారమా అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.