చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది.
పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లలో ప్రశ్నపత్రాలు హల్‌చల్ చేస్తుండడంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత చిత్తూరు జిల్లాలో తెలుగు పేపర్ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. అయితే సాయంత్రానికే ఈ పేపర్ లీక్‌లు అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చారు. మరుసటి రోజు హిందీ పేపర్ పరీక్ష ప్రశ్నపత్నం కూడా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే పేపర్ లీక్ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి డీఈవో పురుషోత్తం ఫిర్యాదు చేశారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రాన్ని ఎవరో కావాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారని డీఈవో అంటున్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని చెప్పుకొచ్చారు.
పేపర్ లీక్‌లో ఏం జరిగింది?
అయితే పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడింది నారాయణ, శ్రీచైతన్య, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సిబ్బందిగా గుర్తించామన్నారు. పవన్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10వేలు, రూ.15వేలు ఇస్తూ వారిని మచ్చిక చేసుకుంటూ ఉండేవాడని అధికారులు తెలిపారు.
పరీక్ష రోజు పరీక్ష ప్రారంభమయ్యాక తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీన్ని చిత్తూరు టాకీస్ అనే వాట్సాప్ గ్రూపులో.. తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్స్‌పాల్ గిరిధర్‌రెడ్డి పోస్టు చేశాడు. తొలుత తనకు రైల్వేకోడూరు నారాయణలో పనిచేసిన సుధాకర్ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని పంపాడని చెప్పి గిరిధర్‌రెడ్డి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించగా.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.
జీడీ నెల్లూరు మండలం నెల్లెపల్లి జెడ్పీ హైస్కూల్ రూమ్ నెంబర్-1 పేపర్‌ను పవన్ కుమార్ ఫోన్‌లో ఫోటో తీసి ఉదయం 9:37 గంటలకు శ్రీ కృష్ణచైతన్య స్కూల్‌లోని సురేష్‌కు పంపారని.. అక్కడ నుంచి ఎన్ఆర్ఐ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్‌కు 9:39 గంటలకు చేరిందని పోలీసులు వెల్లడించారు. అటు తరువాత. 9:40 గంటలకు నారాయణ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డికి, 9:40 గంటలకు తిరుపతి చైతన్య స్కూల్ డీన్ మోహన్‌కు, చివరిగా 9:41 గంటలకు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆరిఫ్‌కు చేరిందన్నారు. ఈ కేసులో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి, ఎన్ఆర్‌ఐ సుధాకర్, శ్రీకృష్ణచైతన్య సురేష్, తిరుపతి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆరీఫ్, చైతన్య స్కూల్ డీన్ మోహన్, ఎన్జీటీలు పవన్ కుమార్, సోములను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయడానికి నారాయణతో పాటు పలు పేరొందిన విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫలితంగా పరీక్ష ప్రారంభమైన గంటలోపు ప్రశ్నపత్రం బయటకు తీసుకురావడం, వాటికి సమాధానాలు రాసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పంపడానికి ఓ ముఠానే ఈ పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇక తెలుగు పేపర్ కాకుండా హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు వార్తలు వచ్చిన అది మాల్ ప్రాక్టీస్‌గా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండల పరిధి తిరుమలయ్యపల్లె ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రం వద్ద బొంతివంక ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడు ప్రహరీ దూకి లోపలి నుంచి ప్రశ్నపత్రాన్ని కిటికీ ద్వారా తెప్పించి మొబైల్‌లో ఫొటోలు తీసుకున్నాడు. మళ్లీ ప్రశ్నపత్రాన్ని లోపలకు చేర్చి వచ్చేశాడు. ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారం రావడంతో సీఐ చంద్రశేఖర్ అనుమానితులను విచారించడంతో సదరు యువకుడు తాను ప్రశ్నపత్రం ఎలా తెచ్చానో వివరించాడు. అయితే తిరుమలయ్యపల్లె కేంద్రంలో పేపర్ లీక్ అయిందని వార్తలు రావడంతో విచారణ చేపట్టామని.. ఇక్కడ ప్రశ్నపత్రం లీకవ్వలేదని పోలీసేలే క్లారిటీ ఇచ్చారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత వెలుపలికి వెళ్లినట్లు గుర్తించామన్నారు. పూర్తి నివేదికలు అందాక బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఈవో పురుషోత్తం తెలిపారు. విద్యార్థులకు మంచి మార్కులు రప్పించి వారి సంస్థలకు మంచి పేరు రావడానికి ఇవన్నీ చేసినట్లు గుర్తించిన అధికారులు నిందితుల వెనుకున్న బడా గ్యాంగ్‌ను పట్టుకోవడానికి విచారణను వేగవంతం చేశారు.
Andhra Pradesh: విషాదం.. పరీక్షా కేంద్రంలోనే ఇంటర్ విద్యార్థి మృతి