ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు చేసుకుంటూ వెళ్లేవారని గుర్తుచేసుకున్నారు. తక్కువ కాలంలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు.