అమరావతి: టీడీపీ గ్రామ కమిటీలతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు. జగన్ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణమని తెలిపారు. ఇప్పటివరకు 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
మరోవైపు భారీ ఎత్తున మెంబర్ షిప్ చేయడంలో గ్రామ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు దాదాపు రూ. 100 కోట్ల సాయం చేసినట్లు తెలిపారు. కార్యకర్తలకు సంక్షేమం కోసం లోకేష్ నేతృత్వంతో ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేశామని.. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అటు తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపైనా చంద్రబాబు స్పందించారు. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్‌పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. కుమారుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్లు తండ్రి తన బైకుపై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్ దుస్థితిని తెలియజేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.