ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ చర్చ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. అసెంబ్లీలో ఈరోజు మూడు రాజధానుల ముచ్చట తెచ్చి మూడు ముక్కల ఆటకు మళ్లీ శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. భావితరాల భవిష్యత్‌పై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా అని.. మంచి మనసు ఉండాలని చంద్రబాబు హితవు పలికారు.
రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించాలి.. చట్ట సభలు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలు రాజ్యాంగం చెప్తుందన్నారు. ఈ ప్రభుత్వం వితండవాదన చేస్తోందని.. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాన్ని చేయలేరు. ప్రజలను చంపేస్తామని చట్టం చేయలేరన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదన్నారు. చట్టాలను న్యాయసూత్రాలకు అనుగుణంగానే చట్టాలు చేయాలి. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందన్నారు. తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. నాటి సభలో వైసీపీ కూడా అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించిందని.. ఇప్పుడు చెబుతున్న మాటలే.. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
నమ్మక ద్రోహం చేసిన వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకసారి రాజధానిని నిర్ణయించిన తర్వాత మార్పు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పని సరి అని చట్టం చెబుతోంది.అలాగే రాజధాని రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి శనిగ్రహం మాదిరి దాపురించారని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలియని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారు. చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరాలన్నారు. సీఎం జగన్ అడుగడుగునా మోసం.. అడుగడుగునా అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వ్యవస్థల మీద దాడులు చేయడం సీఎం జగనుకు అలవాటుగా మారిందన్నారు.
శాసన మండలిని రద్దు చేస్తామంటారు.. ఎస్ఈసీని విమర్శిస్తారు.. సీబీఐపై కేసులు పెడతారు.. ఓ ఎంపీని చంపే ప్రయత్నం చేస్తారు.. ఇలాంటివి చేస్తే కోర్టులు ప్రశ్నించవా అని నిలదీశారు. ల్యాండింగ్ పూల్ చేస్తే రియల్ ఎస్టేటంటారు.. బినామీలంటారు. బినామీలుంటే మూడేళ్లు ఏం పీకారని ప్రశ్నించారు. రాజ్యాంగంలో.. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. ఐదేళ్లపాటు ట్రస్టీగా ఉండమన్నారే తప్ప.. అరాచరాలు చేయమని చెప్పలేదన్నారు. ఏదైనా చేస్తా.. చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటు అవుతుందని.. ప్రజాస్వామ్యంలో పాలకులు సున్నితంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కర్ని కాళ్ల బేరానికి రప్పించుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.