Site icon NTV Telugu

Chandrababu: కశ్మీర్ టు కోనసీమ.. ఇది చాలా బాధాకరం

Chandrababu On Konaseema Internet

Chandrababu On Konaseema Internet

కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసిన విషయం విదితమే! వారం రోజులు అవుతున్నా, ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించలేదు. దీంతో ఉద్యోగులు ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోనన్న భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. వారం రోజులైనా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం.. రాష్ట్ర అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్‌లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవల నిలిపివేత’ అనే వార్తను, ఇప్పుడు మన సీమలో వినాల్సి రావడం బాధాకరమని చెప్పారు.

ఐటీ వంటి ఉద్యోగాలను ఇవ్వలేని ఈ ప్రభుత్వం… కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల లావాదేవీలు సైతం ఇంటర్నెట్ ఆధారంగా నడుస్తున్నాయని, అలాంటి ఈ రోజుల్లో ఏకంగా వారం పాటు ఇంటర్నెట్ సేవల్ని పిలిపివేయడం సరికాదని అన్నారు. కోనసీమలో ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీనత ప్రజలకు ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు.

Exit mobile version