ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతనం గ్రామస్తులతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేయనున్నారు.
మరోవైపు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేసేలా చంద్రబాబు రోడ్ మ్యాప్ తయారుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించే మహానాడు తర్వాత రాష్ట్రమంతా పర్యటిస్తానని ఆయన మీడియాతో చెప్పారు. టీడీపీ అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదని.. జగన్ ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు.