NTV Telugu Site icon

Chandrababu: నాడు చెల్లి.. నేడు తల్లి వెళ్లిపోయింది..!

Chandrababu 2

Chandrababu 2

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయితే, వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలపై స్పందిస్తూ.. మొన్నటి వరకు జగన్‌ అందరినీ వాడుకున్నాడు అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నగరిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాడుకుని వదిలేయడం జగన్ అలవాటుగా మారిందని విమర్శించారు.. మొన్న చెల్లి (వైఎస్‌ షర్మిల) వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి (వైఎస్‌ విజయమ్మ) కూడా వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక, చీకటి పాలన వద్దు… చీకటి జీవోలు వద్దు అని నినదించిన ఆయన.. ధైర్యంగా ఎంతమంది అమ్మ ఒడి, అసరా పెన్షన్‌లు ఇచ్చారు.. ఇంకా ఎవరికి ఏమేమి ఇచ్చారో వెబ్‌సైట్‌లో పెట్టే దమ్ముందా? అని నిలదీశారు.

Read Also: Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..

జనవరిలో జాబ్ క్యాలెండర్‌ ఏమైంది? అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు.. యువతరానికి పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డ ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది చెత్త పరిపాలనగా అభివర్ణించారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, చేతలు గడప కూడా దాటడం లేదన్న ఆయన.. నాకు కేసులు కొత్తకాదన్నారు.. ఇప్పుడు పెగాసిస్ కేసు పెడుతాడట.. అసలు పెగాసిస్ అంటే ఎంటో జగన్ కు తెలుసా…? అని ఎద్దేవా చేశారు. ఇన్ఫర్మేషను టెక్నాలజీ గురించి నాకు చెబుతావా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరిలో చంద్రబాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజానికం.. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అధికారంలోకి వచ్చాకా నగరి రూపురేఖలు మారుస్తా అన్నారు. నగరిలో యాబై వేలమంది చేనేత కార్మికులు ఉన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు యాబైశాతం కరెంట్ లో సబ్సిడీ ఇచ్చాను అని గుర్తుచేశారు. ఇక, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదువందల యూనిట్లు పవర్‌ ఫ్రీగా ఇస్తానని ప్రటించారు. కానీ, వైసీపీ మాత్రం భారీగా కరెంట్ చార్జీలు పెంచింది… దానివల్ల చేనేత కార్మికులపై పెనుభారం పడిందన్నారు.. నగరినీ కాలుష్యరహితంగా మారుస్తాను… నగరిలో టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. మరోవైపు, డైనేజి కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడుతాడా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.. కాలువ తవ్వలేని వ్యక్తి ప్రాజెక్టులు కడుతాడా…? అని సెటైర్లు వేశారు.. నా కష్టాన్ని బూడిదలో పోసినా పన్నీరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.